కామారెడ్డి, నవంబర్ 2 (నవజ్యోతి ప్రతినిధి): పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో కామారెడ్డి జిల్లా పోలీసులు రాష్ట్రస్థాయిలో రికార్డు సాధించారు. పోలీస్ కమిషనరేట్లను మినహాయిస్తే రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు. సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 5,678 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.9.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.2.23 కోట్ల విలువైన 1,397 ఫోన్లను, గత 45 రోజుల్లోనే రూ.42.24 లక్షల విలువైన 264 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం ఈ విజయానికి కృషి చేస్తోందని, బృంద సభ్యుల పనితీరును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేక బృందం విజయం
ఇన్స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక సాంకేతిక బృందం నిరంతరం పనిచేస్తూ పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తోంది.
మొబైల్ పోతే వెంటనే ఇలా చేయండి!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. ఫోన్లోని సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేయించడంతో పాటు, సీఈఐఆర్ పోర్టల్‌లో ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలని తెలిపారు. దీనివల్ల పోగొట్టుకున్న ఫోన్‌ను ఇతరులు వినియోగించకుండా అడ్డుకోవడంతో పాటు, దానిని గుర్తించి రికవరీ చేసే ప్రక్రియకు అవకాశం ఉంటుందని సూచించారు.
బాధితులకు పోలీసుల సూచనలు
1
మొబైల్ పోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
2
సంబంధిత మొబైల్ సిమ్ కార్డును బ్లాక్ చేయించాలి.
3
సీఈఐఆర్ పోర్టల్‌లో ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలి.
రికవరీ అయిన ఫోన్ కోసం సంప్రదించండి
బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్ఎస్ఐ బాలరాజును సంప్రదించాలి.
8712686114
ఆర్ఎస్ఐ బాలరాజు | జిల్లా పోలీస్ కార్యాలయం
పోగొట్టుకున్న ఫోన్ తిరిగి పొందే అవకాశం ఉంది!
ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయండి.. ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయించండి.. పోలీసులకు సహకరించండి.