ఏసీబీ వలకు ఇద్దరు అధికారులు, ఓ డ్రైవర్!
నగరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒకే రోజు రెండు వేర్వేరు లంచం కేసులను నమోదు చేసింది. ఒక కేసులో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.4 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మరో కేసులో రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన అధికారుల సూచనల మేరకు వారి ప్రైవేట్ డ్రైవర్ రూ.2 లక్షలు డిమాండ్ చేసి, రూ.లక్ష లంచం తీసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీ జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్లను పట్టించుకోకుండా ఫిర్యాదుదారుడు భవన నిర్మాణం కొనసాగించేలా చూడటం, తదుపరి ఇబ్బందులు కలిగించకుండా ఉండటం, భవిష్యత్తులో సహకరించడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి నుంచి స్వీకరించిన రూ.4 లక్షల లంచం మొత్తాన్ని ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
ఫిర్యాదుదారుడికి చెందిన ఫిజియోథెరపీ సెంటర్ను సీజ్ చేసిన తాళాలను తిరిగి ఇవ్వడం, డీఎంహెచ్ఓ లైసెన్స్ లేకుండా కేంద్రం నిర్వహిస్తున్నందుకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండటం, అలాగే అదే ఫిజియోథెరపీ సెంటర్కు కొత్త డీఎంహెచ్ఓ లైసెన్స్ జారీ చేయడం కోసం ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. మద్దూరికృష్ణయ్య వద్ద నుంచి రూ.లక్ష లంచం మొత్తాన్ని అతని సూచన మేరకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
ఇలా ఒకే రోజు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన రెండు వేర్వేరు లంచం కేసులు వెలుగులోకి రావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ సేవలు, అనుమతులు, లైసెన్సులకు సంబంధించి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచించారు.






