Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
భక్తి

గణేశ్‌ నిమజ్జనం.. హైదరాబాద్‌ అంతా నిఘా!

20 వేల మంది పోలీసులు.. 10 వేల సీసీ కెమెరాలు.. 24 డ్రోన్లు 25న తుది నిమజ్జనం.. ఖైరతాబాద్‌, బాలాపూర్‌లో భారీగా భక్తుల రాకకు ఏర్పాట్లు
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 23, 2026 · 1 month క్రితం
◉ 170 Views ↗ 1 Shares

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి): గణేశ్‌ నిమజ్జనానికి హైదరాబాద్‌ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్‌ 25న జరిగే తుది నిమజ్జన ఊరేగింపును దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా సుమారు 20 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. 10 వేల సీసీ కెమెరాలు, 24 డ్రోన్లు, దాదాపు 100 హై-రైజ్‌ కెమెరాలతో ఊరేగింపు మార్గాలపై నిరంతర నిఘా కొనసాగించనున్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌ సిటీతోపాటు పొరుగు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు.

10 వేల కెమెరాలతో కంట్రోల్‌ రూమ్‌ నిఘా
ప్రధాన నిమజ్జన మార్గాల్లో ఏర్పాటు చేసిన 10 వేలకు పైగా సీసీ కెమెరాలను బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (టీజీఐసీసీసీ)తో అనుసంధానించారు. 24 డ్రోన్లు, దాదాపు 100 హై-రైజ్‌ కెమెరాలతో జనసమ్మర్థాన్ని పర్యవేక్షించనున్నారు. భవనాలపై బైనాక్యులర్లు, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలతో సిబ్బందిని మోహరించనున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, సిటీ సెక్యూరిటీ వింగ్‌, సీఏఆర్‌ విభాగాల సిబ్బందిని బందోబస్తులో వినియోగించనున్నారు. ఇతర జిల్లాల నుంచి 42 ప్లాటూన్లలో 8,142 మంది సిబ్బందిని ఏడు భద్రతా జోన్లలో కేటాయించారు. చార్మినార్‌, గోల్కొండ, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌లో నాలుగు ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కంపెనీలు, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌లో రెండు సీఆర్‌పీఎఫ్‌ కంపెనీలను మోహరిస్తున్నారు.

బాంబ్‌ డిటెక్షన్‌ బృందాలు 53 తనిఖీలు నిర్వహించనున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్‌ టెర్మినళ్లు, నగర ప్రవేశ మార్గాలు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ను ఇప్పటివరకు సుమారు 25 లక్షల మంది, బాలాపూర్‌ గణేశ్‌ను దాదాపు 15 లక్షల మంది దర్శించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం
ఇప్పటివరకు మొత్తం 32,878 విగ్రహాలు నిమజ్జనమైనట్లు పోలీసులు తెలిపారు. ఇందులో హైదరాబాద్‌ నగర పరిధిలోనే 6,108 విగ్రహాలు ఉన్నాయి. గత 24 గంటల్లో నగరంలో 2,161 విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ప్రధాన జలాశయాల వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిపుణులైన డైవర్లు, రెస్క్యూ బోట్లను మోహరించారు. అంబులెన్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ఫైర్‌ టెండర్లు, జనరేటర్లు, రాత్రి నిఘా కోసం వాచ్‌టవర్లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో వాహనాలు మొరాయిస్తే వెంటనే తొలగించేందుకు మెకానిక్‌లు, ప్రత్యామ్నాయ డ్రైవర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. 26 షీ టీమ్‌లు మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నాయి. సెప్టెంబర్‌ 14 నుంచి ఇప్పటివరకు ఖైరతాబాద్‌, బాలాపూర్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 1,172 మందిని షీ టీమ్‌లు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 1,121 మంది పెద్దలు, 51 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నిమజ్జనం రోజున సీసీఎస్‌కు చెందిన 139 మంది సిబ్బంది ఐదు సెక్టార్లలో విధులు నిర్వహించనున్నారు. మరో 25 ప్రత్యేక సివిల్‌ డ్రస్‌ బృందాలు చోరీలు, వేధింపులు తదితర ఘటనలను అడ్డుకునేందుకు నిఘా పెట్టనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112కు, మహిళలు షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్‌ 9490616555కు సంప్రదించవచ్చని పోలీసులు సూచించారు.

డీజేలు.. హై డెసిబెల్‌ సౌండ్‌ నిషేధం
నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలు, సౌండ్‌ మిక్సర్లు, అధిక శబ్దాన్ని ఉత్పత్తి చేసే ఆడియో పరికరాలు, బాణసంచా వినియోగాన్ని పోలీసులు నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలను స్వాధీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గణేశ్‌ మండపాల అనుమతుల కోసం వచ్చిన 15,426 దరఖాస్తుల్లో భౌతిక పరిశీలన అనంతరం 14,929కు అనుమతి ఇచ్చారు. అనుమతి పొందిన అన్ని మండపాలను జియోట్యాగ్‌ చేశారు. అగ్ని, విద్యుత్‌ భద్రతా జాగ్రత్తలపై తెలుగు, ఇంగ్లిష్‌లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. బాలాపూర్‌-హుస్సేన్‌సాగర్‌ నిమజ్జన మార్గంలో రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌ తీగల సర్దుబాటు, చెట్ల కొమ్మల తొలగింపు వంటి పనులు చేపట్టారు.

నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా భక్తులు, నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కమిషనర్‌ సజ్జనార్‌ కోరారు. వాహనాలకు అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించుకోవాలని, ఊరేగింపుకు ముందు మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రసాదం పంపిణీలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు పాటించాలని కోరారు. నిషేధిత కార్యకలాపాలతోపాటు విద్వేష ప్రసంగాలు, రెచ్చగొట్టే కంటెంట్‌, సోషల్‌ మీడియాలో వదంతుల వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నగర ప్రజలు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram