డీజేలకు నో.. కామారెడ్డిలో పోలీసుల కఠిన ఆంక్షలు !
గణేశ్ ఉత్సవాలు – నిమజ్జనాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో డీజే సౌండ్ సిస్టమ్స్‌పై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నిమజ్జన ఊరేగింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు – ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం డీజే నిర్వాహకులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలోని ప్రతి ఒక్కరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని, సుమారు పది లక్షల జనాభా కలిగిన ఈ పెద్ద కుటుంబంలో ప్రజల క్షేమం – భద్రత పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు.
అధిక శబ్దాలతో కూడిన డీజేల వల్ల వృద్ధులు, చిన్నారులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారితో పాటు ఇతరులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అధిక శబ్దం కారణంగా వినికిడి లోపం, ఒత్తిడి, రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. భారీ జనసమూహంతో జరిగే నిమజ్జన కార్యక్రమాల్లో ఇలాంటి ప్రమాదాలను ముందుగానే నివారించేందుకే డీజేలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
గత ఏడాది కామారెడ్డి పట్టణంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని డీజేలు లేకుండానే సాంప్రదాయ దప్పులు, వాయిద్యాలు – నృత్యాలతో ఘనంగా నిర్వహించుకున్నామని ఎస్పీ గుర్తుచేశారు. అదే స్ఫూర్తిని ఈ ఏడాది కూడా కొనసాగించాలని గణేశ్ ఉత్సవ కమిటీలు – నిర్వాహకులకు సూచించారు. పండుగను భక్తిశ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలని, అయితే ఆ ఆనందం ఇతరులకు ఇబ్బందిగా మారకూడదని అన్నారు.
డీజేల వినియోగంపై నిషేధం ఉన్నందున నిర్వాహకుల నుంచి ఎలాంటి అడ్వాన్స్‌లు తీసుకోవద్దని డీజే నిర్వాహకులకు ఎస్పీ ఆదేశించారు. ఇప్పటికే ఎవరి వద్దైనా అడ్వాన్స్ తీసుకుని ఉంటే వెంటనే సంబంధిత ఉత్సవ కమిటీ నిర్వాహకులకు తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు.
నిబంధనలు తెలిసినా డీజేలను ఏర్పాటు చేసి వినియోగిస్తే నిర్వాహకులు – డీజే ఆపరేటర్లపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. డీజే సౌండ్ సిస్టమ్స్‌ను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని ఎస్పీ తెలిపారు. ప్రజలు, గణేశ్ ఉత్సవ కమిటీలు, డీజే నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు.






