Wednesday, September 30, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

సోమాలియా తీరంలో విషాదం చోరీకి గురైన చమురు ట్యాంకర్‌లో ఐదుగురు మృతి !

మృతుల్లో భారతీయ నావికుడు.. 16 మంది అనుమానిత సముద్ర దొంగల అరెస్ట్
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 30, 2026 · 2 hours క్రితం
◉ 4 Views ↗ 1 Shares
సెప్టెంబర్‌ 30 (నవజ్యోతి ప్రతినిధి)

సోమాలియా తీరంలో సముద్ర దొంగల చెరలో ఉన్న MT Hoarner 25 చమురు ట్యాంకర్‌ను పుంట్‌లాండ్‌ మారిటైమ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (PMPF) రక్షించింది. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు నావికులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు భారతీయుడు కాగా, ముగ్గురు పాకిస్థానీలు, ఒకరు మయన్మార్‌ దేశస్థుడిగా పుంట్‌లాండ్‌ అధికారులు తెలిపారు.

మరో ముగ్గురు పాకిస్థాన్‌ నావికులు, ఒక భారతీయుడు గాయపడినట్లు సమాచారం. సుమారు 18,500 బ్యారెళ్ల చమురుతో మొగాదిషుకు వెళ్తున్న ఈ ట్యాంకర్‌ను ఏప్రిల్‌ 21 నుంచి సముద్ర దొంగలు తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమాలియా తీరంలోని జాఫున్‌, బందర్‌ బేయ్లా ప్రాంతాల మధ్య ట్యాంకర్‌ను నిలిపి ఉంచినట్లు బీబీసీ నివేదిక పేర్కొంది.

నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 10 మంది పాకిస్థానీలు, నలుగురు ఇండోనేషియన్లు, ఒక భారతీయుడు, ఒక శ్రీలంకన్‌, ఒక మయన్మార్‌ పౌరుడు ఉన్నారు. సెప్టెంబర్‌ 29న పుంట్‌లాండ్‌ మారిటైమ్‌ పోలీస్‌ ఫోర్స్‌ చేపట్టిన రక్షణ చర్యల్లో నౌకను తిరిగి స్వాధీనం చేసుకుని 16 మంది అనుమానిత సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

భారతీయ నావికుడి మృతిపై భారత ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెన్యాలోని భారత హైకమిషన్‌ సోమాలియా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులు కోల్‌కతాలో ఉన్నారని, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. MT Sibu 1, MT Eureka నౌకల్లోని భారతీయ నావికులు సహా ఇతర భారతీయులంతా సురక్షితంగా ఉన్నట్లు హైకమిషన్‌ తెలిపింది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram