బెంగళూరు, సెప్టెంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి):
బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో గతంలో వెల్లడికాని సాఫ్ట్వేర్ లోపాన్ని గుర్తించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. నిర్దిష్ట పరిస్థితుల్లో ల్యాండింగ్ సమయంలో ఆటోమేటెడ్ నావిగేషన్ ఫీచర్ పనిచేయకపోయే అవకాశం ఉన్నట్లు కంపెనీ పత్రాలను ఉటంకిస్తూ తెలిపింది.
కాక్‌పిట్ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఈ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు అది విఫలమై, పైలట్లు తమ ప్రణాళికాబద్ధమైన విమాన మార్గాన్ని మార్చిన సందర్భంలో ఈ లోపం తలెత్తే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
బోయింగ్ స్పందన
గత నెలలోనే అన్ని 737 ఆపరేటర్లకు ఈ సాఫ్ట్వేర్ సమస్యపై సమాచారం అందించామని కంపెనీ తెలిపింది. నిర్దిష్ట ల్యాండింగ్ పరిస్థితుల్లో పైలట్లకు ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ అందుబాటులో లేకపోవచ్చని పేర్కొంది.
ఈ పరిస్థితిని సురక్షితంగా ఎదుర్కొనేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న పైలట్ విధానాలను ఆపరేటర్లకు మరోసారి వివరించామని బోయింగ్ తెలిపింది. సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు తమ ఇంజినీర్లు సాఫ్ట్వేర్ అప్డేట్పై పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ లోపంపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కూడా స్పందించింది. కొన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల ఫ్లైట్ కంప్యూటర్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్లో సంభావ్య సమస్యపై తమకు సమాచారం ఉందని తెలిపింది. బోయింగ్, విమానయాన సంస్థలతో కలిసి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొంది.
భద్రతకు సంబంధించిన సమస్య ఏదైనా గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకునేందుకు కరెక్టివ్ యాక్షన్ రివ్యూ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు FAA తెలిపింది. ప్రస్తుతం ఎంతమంది 737 మ్యాక్స్ విమానాల్లో ప్రభావిత సాఫ్ట్వేర్ అమలులో ఉందన్నది స్పష్టంగా తెలియరాలేదు. బోయింగ్, విమానయాన సంస్థలు, నియంత్రణ సంస్థలు సమస్య తీవ్రతను అంచనా వేస్తున్నాయి.
ప్రభావిత సాఫ్ట్‌వేర్‌తో కూడిన కొత్త 737 మ్యాక్స్ విమానాలను ఇప్పుడే డెలివరీ చేయకుండా.. అంతకుముందు వెర్షన్ సాఫ్ట్‌వేర్‌తో ఉన్న విమానాలను అందించాలని సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్‌ను కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
2018, 2019లో జరిగిన రెండు ఘోరమైన 737 మ్యాక్స్ ప్రమాదాల తర్వాత బోయింగ్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా భద్రతా, నియంత్రణ సంస్థల పరిశీలన మరింత పెరిగింది. ఆ ప్రమాదాల అనంతరం 737 మ్యాక్స్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా కొంతకాలం నిలిపివేశారు. 2024లో అలాస్కా ఎయిర్‌లైన్స్ 737 మ్యాక్స్ 9 విమానంలో గాల్లోనే కేబిన్ ప్యానల్ ఊడిపోవడం కూడా బోయింగ్‌పై భద్రతా ఆందోళనలను మరింత పెంచింది.