నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ ఆస్తుల చిట్టా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ సోదాల్లో బయటపడిన ఆస్తుల వివరాలు చూస్తే.. ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, లగ్జరీ కార్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు ఇలా జాబితా పెద్దదిగానే ఉంది. మరి ఇంత ఆస్తి ఎలా సమకూరింది? ఆదాయానికి.. ఆస్తులకు మధ్య అంతరం ఎంత? అసలు లెక్క ఏంటి?
ఏసీబీ అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. వివిధ రకాల ఆస్తులు, పెట్టుబడులు, వాహనాల విలువ కలిపి సుమారు రూ.6.13 కోట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కొన్ని ఆస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం విలువ సుమారు రూ.70 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్నను ముందుకు తెస్తోంది. కనిపిస్తున్న ఆస్తుల విలువ ఒక లెక్క.. మార్కెట్ విలువ మరో లెక్క.. మరి ఆదాయం ఎంత?
ఫ్లాట్లు ఎన్నో.. ప్లాట్లు మరెన్నో?
కూకట్‌పల్లిలో నాలుగు బెడ్రూం, రెండు మూడు బెడ్రూం ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. మణికొండ, కూకట్పల్లి, పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లో మరో ఐదు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్‌లో ఓపెన్ ప్లాట్లతో పాటు విశాఖపట్నంలో సుమారు 800 చదరపు గజాల స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఇన్ని ఆస్తులు.. ఇంత విస్తరణ.. వీటి వెనుక ఆదాయ వనరులేమిటి?
బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.41 లక్షలు, పోస్టాఫీస్‌లో రూ.12 లక్షల డిపాజిట్లు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో రూ.35 లక్షల వరకు పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.29.50 లక్షలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అంటే స్థిరాస్తులతో పాటు నగదు, పెట్టుబడుల రూపంలోనూ ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఇక వాహనాల విషయానికొస్తే.. జాగ్వార్, ఆడి, టాటా కార్లతో పాటు సుమారు రూ.5 లక్షల విలువైన ద్విచక్ర వాహనం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవైపు వైద్య వృత్తి.. మరోవైపు లగ్జరీ కార్లు.. అనేక ప్రాంతాల్లో ఫ్లాట్లు, ప్లాట్లు.. వీటి కొనుగోళ్లకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు సాగుతోంది.
మరో రూ.2.63 కోట్ల లావాదేవీలు?
డీఆర్టీ వివాదంలో ఉన్న ఓ ఆస్తి కొనుగోలుకు రూ.1.30 కోట్లు వెచ్చించినట్లు, వివిధ వ్యక్తులకు రూ.1.33 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆస్తులే ఇంత ఉంటే.. ఆస్తుల కొనుగోళ్లు, అప్పుల లావాదేవీల వెనుక డబ్బు మూలం ఏమిటి? అన్న అంశంపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఏసీబీ లెక్కల్లోకి వచ్చిన ఆస్తులు ఒక్కరోజులో ఏర్పడినవి కావు. ఏళ్ల తరబడి కూడబెట్టిన ఆస్తులు, పెట్టుబడులు, స్థిరాస్తులు, వాహనాలు.. ఒక్కొక్కటిగా ఇప్పుడు దర్యాప్తు పరిధిలోకి వస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై అధికారులు ఈ వివరాలను సేకరించారు. అయితే వీటిలో ఏ ఆస్తి చట్టబద్ధమైన ఆదాయంతో కొనుగోలు చేశారు? ఏ ఆస్తికి ఆదాయ వనరులు ఏమిటి? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులు, కొనుగోళ్లకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు పూర్తయి.. ఆదాయ వనరులు, ఆస్తుల విలువ, వాటి చట్టబద్ధతపై స్పష్టత వచ్చిన తర్వాతే అసలు లెక్క తేలనుంది. అప్పటి వరకు ఏసీబీ గుర్తించిన ఆస్తులు, అధికారులు వ్యక్తం చేసిన అంచనాలే అందుబాటులో ఉన్న వివరాలు.