Tuesday, November 3, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
క్రైమ్

క్యాబ్‌ కోసం డ్రైవర్‌ హత్య..!ముంబైకి తీసుకెళ్తామని నమ్మించి.. తువ్వాలతో గొంతు బిగించి హతమార్చిన దుండగులు

కారుతో మహారాష్ట్రలో బంగారు దుకాణాల దోపిడీకి పథకం.. ముగ్గురు అరెస్ట్‌
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 23, 2026 · 1 month క్రితం
◉ 11 Views ↗ 1 Shares
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (నవజ్యోతి ప్రతినిధి):

క్యాబ్‌ కోసం డ్రైవర్‌ను హత్య చేసి.. అదే కారుతో మహారాష్ట్రలో బంగారు దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడాలని పథకం వేసిన ఐదుగురు నిందితుల వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ కేసులో ముగ్గురిని పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నెలమర్రి రాజశేఖర్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ సెప్టెంబర్‌ 10-11 మధ్య రాత్రి సికింద్రాబాద్‌ ఎస్పీ రోడ్డులోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయం సమీపంలో స్విమ్మింగ్‌ పూల్‌ బస్టాప్‌ వద్ద క్యాబ్‌ నడపడానికి ఒప్పుకున్నాడు. ఐదుగురు వ్యక్తులు ముంబై వెళ్లాలని చెప్పి అతని కారును అద్దెకు తీసుకున్నారు.

క్యాబ్‌ రుద్రారం సమీపంలోని ఎన్‌హెచ్‌-65పై నిర్మాణంలో ఉన్న రోడ్డు ఓవర్‌బ్రిడ్జి వద్దకు చేరుకున్న తర్వాత పరిస్థితి మారిపోయిందని పోలీసులు తెలిపారు. నిర్మానుష్య ప్రాంతంలో రాజశేఖర్‌పై దాడి చేసి తువ్వాలతో గొంతు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలి.. టీజీ 09 టీ 4759 నంబర్‌ కారును తీసుకుని నిందితులు ముంబై వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు.

రాజశేఖర్‌ కనిపించకపోవడంతో తొలుత బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. మరోవైపు నిందితులు కారులో మహారాష్ట్ర వైపు వెళ్తుండగా.. కోహిర్‌ సమీపంలో వాహనంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గోల్డెన్‌ ధాబా వద్ద కారును వదిలేసి జహీరాబాద్‌ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వదిలివెళ్లిన కారు దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.

విచారణలో నిందితులు సికింద్రాబాద్‌లో పరిచయమై.. క్యాబ్‌ను దొంగిలించడం, డ్రైవర్‌ను హత్య చేయడం, కారుతో ముంబై వెళ్లడం వంటి కుట్రకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అక్కడితో ఆగకుండా మహారాష్ట్రలోని బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు చేయాలని, అనంతరం కారును విక్రయించాలని కూడా పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు.

ముగ్గురు అరెస్ట్‌
ఘోడకే రాహుల్‌ (28), సూరజ్‌ శశికాంత్‌ తవాడే (29), బాంబ్లే రాజు రామచంద్ర (33)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

మొదట హత్యకు సంబంధించి బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103(1) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముందుకు సాగడంతో కుట్ర, దోపిడీ, పలువురు కలిసి నేరానికి పాల్పడిన అంశాలు వెలుగులోకి రావడంతో కేసులో మరిన్ని సెక్షన్లు చేర్చారు. ప్రస్తుతం బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 310, 103(1), 61(2) రెడ్‌విత్‌ 3(5) కింద కేసు కొనసాగుతోంది.

మృతుడి కదలికలు, క్యాబ్‌ ప్రయాణం, నిందితుల కదలికలను విశ్లేషించిన ప్రత్యేక బృందాలు ఆధారాలు సేకరించి ముగ్గురిని పట్టుకున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram