అంతర్జాతీయ డెస్క్, సెప్టెంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి): ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఇరు దేశాలు సుమారు 30 బిలియన్ డాలర్ల పరస్పర టారిఫ్ తగ్గింపుకు అంగీకరించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో పాటు కృత్రిమ మేధ (AI)పై ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించేందుకు కూడా ఒప్పందం కుదిరినట్లు తెలిపింది. 0
జిన్‌పింగ్-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మూడు రోజుల శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా మొత్తం ఎనిమిది అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు చైనా తెలిపింది. గతంలో కౌలాలంపూర్‌లో జరిగిన చర్చల్లో వచ్చిన ఫలితాలను కొనసాగించాలని, ఇరు దేశాల వాణిజ్య వ్యవహారాల కోసం ప్రత్యేక ట్రేడ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 1
ఏఐ రంగంలో ఇరు దేశాలు ప్రత్యేక చర్చలు నిర్వహించనున్నాయి. AI వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలపై చర్చించడంతో పాటు నవంబర్‌లో తదుపరి దశ చర్చలు జరపనున్నారు. AI సంబంధిత అనుకోని ఘటనలపై పరస్పరం సమాచారం పంచుకునేందుకు ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానల్‌ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. 2
వాణిజ్య అంశాల్లో ఈ తాజా అవగాహనకు ముందు అమెరికా-చైనా ఇప్పటికే కొనసాగుతున్న వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగించేందుకు అంగీకరించాయి. నవంబర్ 10తో ముగియాల్సిన ఆ సంధి ద్వారా మరింత విస్తృతమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సమయం లభించనుంది. 3
ఇరు దేశాల అధ్యక్షులు ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (APEC), జీ20 సమావేశాల విషయంలోనూ పరస్పర సహకారానికి అంగీకరించారు. ఒకరి దేశంలో జరిగే సమావేశాలకు మరొక దేశాధినేత హాజరయ్యేలా పరస్పరం మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చైనా వెల్లడించింది. 4
విదేశాంగ అంశాల్లోనూ కొన్ని అంశాలపై అవగాహనకు వచ్చినట్లు చైనా తెలిపింది. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదన్న అంశంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాల్లో ఏ దేశం లేదా సంస్థ రవాణా రుసుములు విధించకూడదన్న అంశాన్ని కూడా ఇరు దేశాలు అంగీకరించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. 5
జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్-జిన్‌పింగ్ మధ్య వాణిజ్యం, భద్రత, ఏఐ, సాంకేతికతతో పాటు మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్, కొరియా ద్వీపకల్ప పరిస్థితులపై చర్చలు జరిగినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరు దేశాలు పోటీతో పాటు సహకారాన్ని కొనసాగిస్తూ, విభేదాలను నియంత్రించే దిశగా సంబంధాలను నడిపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 6
మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న జిన్‌పింగ్ శనివారం బీజింగ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో వాణిజ్య రంగంలో టారిఫ్ తగ్గింపుపై అవగాహన, AIపై కొత్త చర్చల వ్యవస్థ ఏర్పాటవడం తదుపరి దశలో అమెరికా-చైనా సంబంధాలకు కీలక అంశాలుగా మారనున్నాయి. 7