Saturday, October 31, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
నేర వార్తలు

రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై రంపం తో దాడి

బాలిక పరిస్థితిపై బంధువుల ఆగ్రహం.. ఆసుపత్రిలో పరామర్శించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 31, 2026 · 27 seconds క్రితం
◉ 1 Views ↗ 1 Shares

బాలిక పరిస్థితిపై బంధువుల ఆగ్రహం.. ఆసుపత్రిలో పరామర్శించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

అనంతపురం జిల్లా
విద్యార్థినుల భద్రతపై ఆందోళన

అనంతపురం, అక్టోబర్ 31 (నవజ్యోతి ప్రతినిధి):

పాఠశాల ఆవరణలో విద్యార్థినిపై కత్తిరింపు యంత్రంతో దాడి జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం గణిత పాఠం జరుగుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న గోపిక లక్ష్మి (14)పై హేమంత్‌ (21) అనే యువకుడు కత్తిరింపు యంత్రంతో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని లక్ష్మి కూడా గాయపడింది. దాడి అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని ధర్మవరం రైల్వే స్టేషన్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు ధర్మవరం మండలం నాగలూరుకు చెందినవాడిగా, బాధిత బాలికకు దగ్గరి బంధువుగా సమాచారం. దాడికి గల కారణాలపై వ్యక్తిగత వివాదాలు సహా వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా గోపిక లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడిలో బాలిక కుడిచేయి తెగిపోయినట్లు బంధువులు తెలిపారు. ముంజేతిపై కూడా తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. బాలిక పరిస్థితిపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థినులకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని బాలిక మేనత్త దివ్యానంద్‌ డిమాండ్‌ చేశారు.

పాఠశాలలోకి యంత్రంతో ఎలా వచ్చాడు?
పాఠశాల తరగతి గదిలోకి ప్రమాదకరమైన కత్తిరింపు యంత్రంతో వ్యక్తి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడటం భద్రతా లోపాలను ప్రశ్నిస్తోంది. పాఠశాలల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై చర్చ మొదలైంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేశ్‌ కూడా ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, బాలికలపై జరిగిన దాడి తనను కలచివేసిందని పేర్కొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులతో మాట్లాడి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి బాధిత బాలికల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న ఇద్దరు విద్యార్థినులను పరామర్శించారు. బాధిత బాలికతో పాటు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించి గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్య సేవల వివరాలను సేకరించారు. మరోవైపు ఆర్డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. పాఠశాలలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు? భద్రతా సిబ్బంది ఉన్నారా? ఘటన సమయంలో పాఠశాల యాజమాన్యం తీసుకున్న చర్యలేమిటి? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

విద్యార్థినుల భద్రతపై ప్రశ్నలు
పాఠశాలల్లో విద్యార్థినుల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పాఠశాలల్లోకి బయటి వ్యక్తుల ప్రవేశంపై నియంత్రణ, భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

నవజ్యోతి తెలుగు డైలీ
ప్రజల పక్షం.. ప్రజా సమస్యలపై నిరంతర కథనం

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram