Wednesday, September 30, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
అంతర్జాతీయ

180 మంది ప్రాణాల కోసం పోరాడిన భారత పైలట్‌…హీరోలా నిలిచిన స్మిత్‌ మచ్చర్‌!

కాక్‌పిట్‌లో తీవ్ర ఘర్షణ.. సహ పైలట్‌ దాడి.. అయినా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేసిన భారత కెప్టెన్‌
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
September 30, 2026 · 1 hour క్రితం
◉ 1 Views ↗ 1 Shares
సెప్టెంబర్‌ 30 (నవజ్యోతి ప్రతినిధి)

ఆకాశంలో విమానం ప్రయాణిస్తోంది.. కాక్‌పిట్‌లో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత.. సహ పైలట్‌ నుంచి దాడి ఎదురైనా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని విమానాన్ని అదుపులో ఉంచి సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ విమాన నియంత్రణను కొనసాగించిన ఆయనను ప్రయాణికుల భద్రత కోసం కీలకంగా వ్యవహరించిన పైలట్‌గా పలువురు అభివర్ణిస్తున్నారు.

అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం స్మిత్‌ మచ్చర్‌ భారతీయ పైలట్‌. గతంలో స్పైస్‌జెట్‌లో పనిచేసిన ఆయనకు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉన్నట్లు సమాచారం. బోయింగ్‌ 737 విమానాల్లో సుమారు 9,750 గంటల ఫ్లయింగ్‌ అనుభవం ఆయనకు ఉంది. బోయింగ్‌ 737-800తో పాటు 737 మ్యాక్స్‌ 8, మ్యాక్స్‌ 9 విమానాలను కూడా ఆయన నడిపినట్లు సమాచారం.

స్పైస్‌జెట్‌లో సీనియర్‌ కమాండర్‌, లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. కొత్త పైలట్లకు శిక్షణ ఇవ్వడం, వారి పనితీరును పరిశీలించడం వంటి బాధ్యతల్లోనూ అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. 2022 జూన్‌లో ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్‌ ఎంట్రీ కెప్టెన్‌గా చేరిన ఆయన దుబాయ్‌ కేంద్రంగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటన ఫ్లై దుబాయ్‌కు చెందిన ఎఫ్‌జెడ్‌1073 విమానంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు సుమారు 180 మంది ప్రయాణికులు, సిబ్బందితో విమానం బయలుదేరింది. ప్రయాణ సమయంలో కాక్‌పిట్‌లో కెప్టెన్‌, ఒమన్‌కు చెందిన సహ పైలట్‌ మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో సహ పైలట్‌ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

పరిస్థితి తీవ్రంగా మారడంతో విమానం భద్రతపై ఆందోళన నెలకొంది. అత్యవసర పరిస్థితికి సంబంధించిన సంకేతాలు పంపినట్లు సమాచారం. విమానాన్ని హైజాక్‌ చేసినట్లు భావించే 7500 కోడ్‌ కూడా ప్రసారం కావడంతో ఘటన మరింత ఉత్కంఠకు దారితీసింది. ఇజ్రాయెల్‌ వైమానిక దళం అప్రమత్తమై యుద్ధవిమానాలను రంగంలోకి దించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ సమయంలో విమానం వేగంగా దిగువకు వచ్చినట్లు కూడా సమాచారం. అయినప్పటికీ విమాన నియంత్రణను కొనసాగించిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ విమానాన్ని టెల్‌ అవీవ్‌కు బదులుగా సౌదీ అరేబియాలోని తబూక్‌కు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి తక్షణ ప్రమాదం తప్పినట్లు ఫ్లై దుబాయ్‌ ప్రకటించింది.

ఘటన అనంతరం విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని ఫ్లై దుబాయ్‌ తెలిపింది. సంబంధిత అధికారులతో కలిసి దర్యాప్తులో సహకరిస్తున్నట్లు పేర్కొంది. కాక్‌పిట్‌లో ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడి జరిగిన పూర్తి క్రమం, సహ పైలట్‌ ఉద్దేశం వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

తీవ్ర ఒత్తిడి, కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణ, విమాన భద్రతపై నెలకొన్న అనుమానాల మధ్య కూడా విమానాన్ని అదుపులో ఉంచి సురక్షితంగా ల్యాండ్‌ చేయడం ఈ ఘటనలో కీలక అంశంగా మారింది. అందుకే భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ పేరు ఇప్పుడు అంతర్జాతీయ విమానయాన వర్గాల్లో చర్చకు వచ్చింది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram