భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతిక రంగాల్లో సహకారంపై నేతలు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ప్రపంచ శాంతి, భద్రతకు సంబంధించిన అంశాలపైనా అభిప్రాయాలను పంచుకున్నారు.
ఫోన్ సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ట్రంప్‌తో జరిగిన చర్చ ఫలప్రదంగా సాగిందని తెలిపారు. భారత్–అమెరికా సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు సన్నిహితంగా కొనసాగాలని అంగీకరించినట్లు పేర్కొన్నారు.
వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్లేందుకు సన్నిహితంగా పనిచేయాలని మోదీ, ట్రంప్ నిర్ణయించినట్లు తెలిపింది.
ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు నేతలు చర్చించినట్లు పీఎంవో తెలిపింది. ప్రపంచ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలపై అభిప్రాయాలను పంచుకున్నారని పేర్కొంది. భవిష్యత్తులోనూ పరస్పరం సంప్రదింపులు కొనసాగించాలని నేతలు అంగీకరించినట్లు వెల్లడించింది.
రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలపై అధిక సుంకాలు విధించే అధికారాలను అమెరికా అధ్యక్షుడికి కల్పించే కొత్త చట్టాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన కొద్ది రోజులకే ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మోదీ విడుదల చేసిన ప్రకటనలోనూ, ప్రధాని కార్యాలయ వివరాల్లోనూ ఆ చట్టం లేదా నిర్దిష్ట సుంకాలపై చర్చ జరిగినట్లు ప్రస్తావన లేదు.