భూమి హక్కుల పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి
జగిత్యాల జిల్లా బ్యూరో, నవజ్యోతి దినపత్రిక:చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో పేదలు, అణగారిన వర్గాల భూమి హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వసంత సురేష్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మను ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం సరికాదన్నారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందన్నారు. అణచివేత, దోపిడీకి ఎదురొడ్డి ధైర్యంగా నిలిచిన ఐలమ్మ పోరాట పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రస్తుతం పేదలకు చెందిన భూములను వారికి తెలియకుండానే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని ఆమె ఆరోపించారు. పేదల భూములకు అన్యాయం జరిగితే ఐలమ్మ స్ఫూర్తితో వారి హక్కుల కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రజకుల సంక్షేమానికి దోబీఘాట్ల ఏర్పాటు, ఉచిత విద్యుత్ వంటి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, సర్పంచ్ కట్ట రాజేందర్, ఉప సర్పంచ్ గంగరాజం, రజక సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొని ఐలమ్మకు నివాళులర్పించారు.






