న్యూయార్క్, సెప్టెంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి):
ఉగ్రవాదంపై పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాక్ జర్నలిస్ట్ భారత ప్రభుత్వమే పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ ప్రశ్నించగా.. జైశంకర్ సూటిగా బదులిచ్చారు.
“ఉగ్రవాద దేశం నుంచి ఈ ప్రశ్నా?.. కమ్ ఆన్!”
జైశంకర్ సమాధానంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారింది. వెంటనే ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని జోక్యం చేసుకుని.. “మీకు సమాధానం వినిపించింది. స్పష్టంగా సమాధానం ఇచ్చారు” అని జర్నలిస్ట్‌కు తెలిపారు.
81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో జైశంకర్ పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. షిప్పింగ్, నావికుల భద్రతపై గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదంపై పాకిస్తాన్ విశ్వసనీయమైన, ధ్రువీకరించగల చర్యలు తీసుకోవాలని భారత్ పదేపదే కోరుతోంది. పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయంటూ భారత్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఈ అంశంపై తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి.