‘బర్త్ టూరిజం’పై ట్రంప్ సర్కార్ కొరడా! అమెరికా పౌరసత్వం కోసం ప్రసవ ప్రయాణాలకు వీసా ఆంక్షలు
వాషింగ్టన్, సెప్టెంబర్ 26 (నవజ్యోతి ప్రతినిధి): అమెరికా పౌరసత్వం పొందేందుకు ప్రసవం కోసం ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వెళ్లే ‘బర్త్ టూరిజం’పై ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. వాణిజ్యపరంగా బర్త్ టూరిజం నెట్‌వర్క్‌లను నిర్వహించే వ్యక్తులు, వాటికి సహకరించే మధ్యవర్తులు, ఇతర సంబంధిత వ్యక్తులపై లక్ష్యిత వీసా ఆంక్షలను ప్రకటించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించిన ఈ చర్యల్లో.. అమెరికాలో ప్రసవం ద్వారా పుట్టిన బిడ్డకు అమెరికా పౌరసత్వం లభించేలా ప్రయాణాలను ఏర్పాటు చేసే వాణిజ్య సంస్థలు, వాటి నిర్వాహకులు, మేనేజర్లు, మధ్యవర్తులు లక్ష్యంగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సంబంధిత కుటుంబ సభ్యులపైనా ఆంక్షలు వర్తించే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
విదేశీ వాణిజ్య బర్త్ టూరిజం నెట్‌వర్క్‌లు అమెరికా వలస వ్యవస్థను ఉపయోగించుకుని లాభాల కోసం అమెరికా పౌరసత్వాన్ని విక్రయిస్తున్నాయని రూబియో ఆరోపించారు. వీసా అధికారులను తప్పుదోవ పట్టించేలా విదేశీయులకు శిక్షణ ఇవ్వడం, అమెరికాలో ప్రసవం జరిగేలా ప్రయాణ ఏర్పాట్లు చేయడం వంటి కార్యకలాపాలకు భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వీసా దరఖాస్తుల్లో తప్పుడు వివరాలు సమర్పించేందుకు సహకరించే మధ్యవర్తులు, బర్త్ టూరిజం సంస్థల యజమానులు, నిర్వాహకులతో పాటు.. ఈ వ్యవహారాలకు తెలిసీ సహకరించే విదేశీ వైద్య సిబ్బంది, మోసపూరితంగా మెడికెయిడ్ ప్రయోజనాలను వినియోగించడంలో సహకరించే వ్యక్తులపైనా చర్యలు ఉండొచ్చని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రస్తుతం లేదా గతంలో బర్త్ టూరిజం కార్యకలాపాలను నిర్వహించిన లేదా అందులో సహకరించిన వ్యక్తులపై కూడా ఈ విధానం వర్తించవచ్చని రూబియో తెలిపారు. అయితే ఏ కుటుంబ సభ్యులకు, ఎలాంటి పరిస్థితుల్లో ఆంక్షలు వర్తిస్తాయన్న దానిపై విదేశాంగ శాఖ పూర్తి వివరాలను వెల్లడించలేదు.
వీసా మోసాలను గుర్తించేందుకు అమెరికా విదేశాంగ శాఖ కొత్త ఆన్‌లైన్ రిపోర్టింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించింది. తప్పుడు ప్రయాణ ప్రణాళికలు, నకిలీ వివాహాలు, షెల్ కంపెనీలు, కల్పిత ఉద్యోగ ఆఫర్లు, బర్త్ టూరిజం వంటి అంశాలపై ప్రజలు సమాచారాన్ని అధికారులకు అందించవచ్చు.
ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు తెలిపారు. వీసా రద్దు నుంచి నేర దర్యాప్తు కోసం సంబంధిత సంస్థలకు కేసులను బదిలీ చేయడం వరకు చర్యలు ఉండవచ్చని వెల్లడించారు. ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలంలో వీసా మోసాలపై చర్యలకు దారితీసిన సమాచారం ప్రజల నుంచే వచ్చిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ.. నిర్దిష్ట గణాంకాలను వెల్లడించలేదు.
విదేశీయులు తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం లభించే ఉద్దేశంతో ప్రసవం కోసం అమెరికాకు వెళ్లడాన్ని సాధారణంగా ‘బర్త్ టూరిజం’గా పేర్కొంటారు. కొన్ని వాణిజ్య నెట్‌వర్క్‌లు వసతి, వైద్య సేవలు, ప్రయాణ ఏర్పాట్లు వంటి ప్యాకేజీలను అందిస్తున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
ఈ అంశం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని పౌరసత్వ నిబంధనతోనూ ముడిపడి ఉంది. అమెరికా భూభాగంలో జన్మించిన వారికి పౌరసత్వం కల్పించే ఈ నిబంధనపై రాజకీయ, న్యాయపరమైన చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. బర్త్ టూరిజంపై ట్రంప్ ప్రభుత్వం గతంలోనూ చర్యలు ప్రకటించింది.
తాజా చర్యల్లో ప్రధానంగా వీసా మోసం, వాణిజ్య బర్త్ టూరిజం నెట్‌వర్క్‌లు, తప్పుడు సమాచారం అందించే మధ్యవర్తులపై దృష్టి పెట్టినట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కొత్త విధానం అమలు నేపథ్యంలో వీసా దరఖాస్తులు, ప్రయాణ ఉద్దేశాలు, సంబంధిత పత్రాల పరిశీలన మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉంది.






