వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు చికిత్స చేస్తున్నాడనే ఆరోపణలతో 23 ఏళ్ల యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఛాతినొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, కిడ్నీ, మూత్ర సంబంధిత సమస్యలకు చికిత్స చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
టాస్క్‌ఫోర్స్, గోల్కొండ పోలీసులు కలిసి హిక్మా సెహత్ కేర్ సెంటర్‌పై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అద్నాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్లినిక్‌లో తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి లేబుల్ లేకుండా చేతిరాత కోడ్‌లు మాత్రమే ఉన్న బాటిళ్లు, ప్యాకెట్లలో వివిధ రకాల పొడులు, మందులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
క్లినిక్‌లో ఏం దొరికిందంటే..
గుర్తింపు వివరాలు లేని మందుల బాటిళ్లు, ప్యాకెట్లు, ప్రిస్క్రిప్షన్ పుస్తకాలు, క్లినిక్ ప్రచారానికి సంబంధించిన సామాజిక మాధ్యమాల మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అద్నాన్ వైద్య విద్య లేదా గుర్తింపు పొందిన వైద్య అర్హత లేకుండానే రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఛాతినొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కిడ్నీ సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యలకు మందులు సూచించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వ్యవహారంలో అద్నాన్ తల్లి, సోదరుడి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. క్లినిక్ నిర్వహణ, మందుల సరఫరా, రోగులకు అందించిన చికిత్సకు సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై సంబంధిత బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న మందులు, ప్రిస్క్రిప్షన్ పుస్తకాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్న పోలీసులు.. క్లినిక్‌కు ఎంతకాలంగా రోగులు వస్తున్నారు, ఎంతమందికి చికిత్స అందించారు, మందుల మూలం ఏమిటనే కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తున్నారు.