గ్రామాభివృద్ధి, రైతులు, మత్స్యకారుల సమస్యలపై పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి ప్రస్తావన
జగిత్యాల రూరల్ మండలం మరియు గ్రామాభివృద్ధి సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ సమావేశంలో జగిత్యాల సహకార సంఘం అధ్యక్షులు పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి గారు మోరపల్లి గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
మోరపల్లి–తాటిపల్లి శివారులో ఉన్న నల్లగుట్టను తొలగించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు చేపడుతున్న విషయంపై ఆయన స్పందిస్తూ, గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం బాధాకరమన్నారు. కనీసం గ్రామ పంచాయతీ తీర్మానం కూడా లేకపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గుట్ట తొలగింపు వల్ల ప్రకృతి వనరులకు నష్టం కలిగే అవకాశం ఉందని, భూగర్భ జలాలు, అటవీ సంపదకు ఇబ్బంది కలగవచ్చని తెలిపారు. అలాగే గుట్ట మట్టిని విచ్చలవిడిగా విక్రయించే పరిస్థితి ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
మోరపల్లి గ్రామంలోని డీ3 ఎస్ఆర్ఎస్పీ కాలువ పూర్తిగా దెబ్బతిన్నందున, ఉపాధి హామీ పథకం ద్వారా మరమ్మతు పనులు చేపట్టాలని కోరారు. రైతులకు యూరియా సరఫరా విషయంలో ఒక యూరియా బస్తాపై ప్రభుత్వం రవాణా చార్జీలను నిలిపివేయడం వల్ల రైతులపై సుమారు రూ.30 వరకు అదనపు భారం పడుతోందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని కోరారు.
అలాగే మండలంలోని పలువురు నిరుపేదలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లు ఎల్3లో ఉన్నాయని, వాటిని ఎల్1కు మార్చాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనికి సంబంధించి నివేదికలు కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. గంగపుత్రులకు వర్షాకాలం ప్రారంభమై ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు చేప పిల్లల పంపిణీ జరగలేదని తెలిపారు. వెంటనే చేప పిల్లలను పంపిణీ చేసి గంగపుత్రులకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు రైతులు, నిరుపేదలు, మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి కోరారు.






