Sunday, November 1, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
జగిత్యాల

దసరా వేళ మానవత్వపు చల్లని పలకరింపు!

జంబి గద్దెకు వెళ్లే భక్తులకు జామే మస్జిద్ కమిటీ తాగునీటి పంపిణీ
CHIKOTI SAIMANIKANTA - MANAGING EDITOR
October 21, 2026 · 2 weeks క్రితం
◉ 10 Views ↗ 0 Shares
Oplus_16908288

కోరుట్ల, అక్టోబర్ 21 (నవజ్యోతి ప్రతినిధి ముహమ్మద్ ఫిర్దోస్): మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటిచెప్పే సేవా కార్యక్రమం కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. విజయదశమి సందర్భంగా జామే మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో జంబి గద్దెకు వెళ్లే మార్గంలో భక్తులు, ప్రజలకు తాగునీటిని పంపిణీ చేశారు. పండుగ వేళ పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ముస్లిం సోదరులు చేపట్టిన ఈ కార్యక్రమం మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది.

జంబి గద్దెకు వెళ్లే మార్గంలో రాకపోకలు సాగిస్తున్న భక్తులకు, ప్రజలకు కమిటీ సభ్యులు తాగునీరు అందించారు. పండుగ సమయంలో ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యం కల్పించాలనే ఆలోచనతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇతర మతాల పండుగల సందర్భంగా కూడా ప్రజలకు సేవ చేయడం ద్వారా పరస్పర గౌరవం, సామాజిక ఐక్యతను బలోపేతం చేయవచ్చనే సందేశాన్ని అందించారు.

విజయదశమి వంటి హిందువుల పవిత్ర పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు తాగునీటి పంపిణీకి ముందుకు రావడం పట్టణంలో సోదరభావాన్ని చాటిచెప్పింది. మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడమే నిజమైన మానవత్వమనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించి, పరస్పర విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

జామే మస్జిద్ కమిటీ అధ్యక్షుడు మసిఉద్దీన్, కమిటీ సభ్యులు సుజాయిత్ అలీ, అస్లాం, ఖాలీద్, ఇర్ఫన్, అక్రమ్, షాదబ్, రిజ్వాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
Facebook Telegram