నిమజ్జన ఊరేగింపులో డాన్స్ చేస్తూ వ్యక్తి మృతి!
తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 19 (నవజ్యోతి ప్రతినిధి): వినాయక నిమజ్జన ఊరేగింపులో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెంలో విషాదం నింపింది. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో కారు స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఆర్కెస్ట్రా పాటలకు పలువురు నృత్యం చేస్తుండగా కాకర్లమూడి ఏసు (48) స్నేహితులతో కలిసి డాన్స్ చేశారు.
కొద్దిసేపటికే నృత్యం చేస్తూనే ఏసు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆయనను తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు ఎల్.అగ్రహారంలోని టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటూ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సమాచారం.
మృతికి ఖచ్చితమైన కారణం వైద్య నివేదిక ద్వారా స్పష్టత రావాల్సి ఉంది. వినాయక నిమజ్జన వేడుకల్లో చోటుచేసుకున్న ఈ ఘటనతో పాల్గొన్న వారిలో విషాదం నెలకొంది.






